అమెజాన్ పేరుతో వచ్చిన ఫేక్ జాబ్ నోటిఫికేషన్ చూసి బీటెక్ చేసిన కేయూ ఏరియా యువకుడు రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ‘మనీ ఇన్వెస్ట్మెంట్ యాప్’లో డబ్బులు పెట్టి హనుమకొండకు చెందిన ఓ పోలీస్ అధికారి లక్షలు మునిగాడు. మరో యువకుడు అత్యాశకు ఓటీపీ చెప్పి ఖాతా ఖాళీ అయి నెత్తీనోరు బాదుకుంటున్నాడు. పల్లె ప్రాంత నిరక్షరాస్యులే కాదు టెక్నాలజీపై అవగాహన ఉన్న విద్యావంతులు, ఉద్యోగులు, అవగాహన కల్పించే పోలీసులనూ తన మాయలో పడేసి సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారు. ఇలా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఒక్క అక్టోబర్ నెలలోనే 28 కేసులు నమోదు కాగా.. ఫ్రాడ్కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు అమాయకులు వారి ఉచ్చులోపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డ్స్, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ ఆఫర్లతో సులభంగా డబ్బు సంపాదించొచ్చని జనానికి ఆశలు రేకెత్తించి.. నిలువునా ముంచుతున్నారు. ఇటీవలికాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇలాంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరస్తుల మాయలోపడి నిత్యం ఏదోచోట డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అనవసర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు.. వాట్సాప్ నంబర్లకు వచ్చే మెసేజ్‌లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ లిఫ్ట్ చేసి ఓటీపీ నంబర్, బ్యాంకు వివరాలు చెప్పొద్దని పోలీసులు చెబుతున్నా, కొందరు మాత్రం అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకుని ఇళ్లుగుల్ల చేసుకుంటున్నారు. అయితే బాధితుల్లో ఉన్నత చదువులు చదివినవారు, యువతీ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒక్క అక్టోబర్ నెలలోనే 28 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని లక్షల రూపాయలు పొగొట్టుకున్నారని సైబర్ విభాగం పోలీస్ అధికారులు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మధ్యకాలంలో జరిగిన ఆన్లైన్ మోసాల్లో బాధితుల పేర్లు తెలుపకుండా మచ్చుకు కొన్ని..
కారు గెల్చుకున్నారంటూ..
బాలసముద్రానికి చెందిన ఓ వ్యక్తికి కారు గెల్చుకున్నారని మెసేజ్‌తో వాట్సాప్ లింకు వచ్చింది. అతడు ఆ లింకును ఓపెన్ చేశాడు. కారు కావాలంటే రూ.3500 ఆన్లైన్ ద్వారా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మళ్లీ మెసేజ్ పెట్టాడు. నిజమేనని నమ్మి సదరు వ్యక్తి గూగుల్‌పే ద్వారా డబ్బులు చెల్లించాడు. ‘కారు పంపిస్తాం.. రవాణా చార్జీల కోసం మరో రూ.15 వేలు పంపించండి’ అని మళ్లీ మెసేజ్ రావడంతో డబ్బులు చెల్లించాడు. మరునాడు వచ్చిన మెసేజ్ లింకును ఓపెన్ చేసి చూడగా లింకు బ్లాక్ చేసి ఉంది. దీంతో మోసపోయానని గుర్తించి బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశాడు.
మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో..
మనీ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లో డబ్బులు పెడితే 12రోజుల్లో 3.10శాతంతో వడ్డీ పొందొచ్చని తెలుసుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సెల్‌నంబర్‌తో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఫోన్‌పే ద్వారా రూ.50వేల చొప్పున 8సార్లు రూ.4లక్షలు పెట్టుబడిపెట్టాడు. ఈ విషయం కానిస్టేబుల్ తన భార్య, కొడుకు, కోడలు చెప్పడంతో వారు కూడా అదే యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొడుకు 9సార్లు రూ.3.69లక్షలు, కోడలు 11సార్లు రూ.2.91లక్షలు, భార్య రెండుసార్లు రూ.లక్ష.. మొత్తం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు రూ.11.60లక్షలు ఫోన్‌పే ద్వారా చెల్లించారు. 12 రోజుల తర్వాత యాప్‌లో అప్లికేషన్ ఓపెన్ చేయగా సైబర్ నేరగాడు సస్పెండ్ చేశాడు. చివరికి ఆన్లైన్ పెట్టుబడిలో మోసపోయామని తెలుసుకున్న బాధిత కానిస్టేబుల్ యాప్ యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని..
హనుమకొండ రాయపురకు చెందిన యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ‘మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగింది.. వెరిఫికేషన్ కోసం ఫోన్ చేశాను. మీ సెల్‌కు వచ్చిన కోడ్ మెసేజ్ చెప్పండి’ అని అడిగాడు. నిజమేనని నమ్మి ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌కు వచ్చిన కోడ్ నంబర్(ఓటీపీ నంబర్) చెప్పాడు. ఇంకేముంది ఆ యువకుడి ఎస్బీఐ బ్యాంకు ఖాతానుంచి ఆన్లైన్లో రూ.20వేల చొప్పున ఐదుసార్లు రూ.1,16,150 డ్రా అయ్యాయి. మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు పెట్టి ఫిర్యాదు చేశాడు.
జాబ్పేరుతో..లక్షలు పొగొట్టుకున్న యువకుడు
కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ యువకుడు అమెజాన్ పేరుతోవచ్చిన ఒక ఫేక్ జాబ్ ప్రకటన చూసి మోసపోయాడు. బీటెక్ చదివిన ఆ యువకుడికి ‘మీ స్కిల్ ఉంటే వేతనం పెరుగుతుంది. మా కంపెనీలో ఉద్యోగం కావాలంటే ముందు రిజిస్టర్ కావాలి, అప్లికేషన్ అప్రూవ్ కావాలంటే రూ.50వేలు ఫోన్‌పే లేదా, గూగుల్ పే ద్వారా పంపించడని వల వేశాడు. నిజమేనని నమ్మిన ఆ యువకుడు ఫోన్‌పే ద్వారా మూడు సార్లు రూ.లక్షా30వేలు చెల్లించి మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు.
చాలా జాగ్రత్తగా ఉండాలి
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్తరకమైన ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్, ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, తదితర మాధ్యమాల నుంచి వచ్చిన లింకులు ఓపెన్ చేయొద్దు. లాటరీలు, మనీ పెట్టుబడి, డిస్కౌంట్ ఆఫర్లు, జాబ్‌ల పేరుతో వచ్చె మెసేజ్‌లు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ లిఫ్ట్ చేసి ఓటీపీ నంబర్లు, బ్యాంకు వివరాలు చెప్పొద్దు. అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ముప్పును కొనితెచ్చుకోవద్దు. ఆన్లైన్ మోసం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మిగతా కేసుల్లో నేరస్తులను పట్టుకున్నంత సులువుగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కుదరదు. ఆ దొంగలు ఎక్కడో ఉండి ఆన్లైన్లో మోసాలు చేస్తారు. – జనార్దన్‌రెడ్డి, సైబర్ విభాగం సీఐ, వరంగల్ పోలీస్ కమిషనరేట్