ఖిలావరంగల్, డిసెంబర్ 10 : అందమైన కట్టడాల నడుమ అత్యద్భుతంగా నిర్మితమై చూపరులను కట్టిపడేసే మెట్లబావి కాకతీయుల చారిత్రక వైభవానికి అద్దం పడుతున్నది. ఖిలా వరంగల్ కోట సమీప శివనగర్‌లోని ఈ కోనేరు నిర్మాణ శైలి ఇటు పర్యాటకులను ఆకట్టుకోవడమే గాక అంతుచిక్కని రహస్యాలతో కొత్త అనుభూతి కలిగిస్తున్నది. ఇందులో తూర్పు వైపున 10, 20 అడుగులు కింది దిగితే ప్రత్యక్షమయ్యే మొదటి, రెండో భూగృహాల వద్దకు చేరుకోవడమే సులభమే కానీ మూడవది చూడాలంటే మాత్రం సాహసం చేయాల్సిందే. వేసవి కాలంలో తప్ప మిగతా సమయంలో చూసే వీలు లేని ఈ కట్టడం, సమీపంలో పెద్ద పెద్ద బండరాళ్లలో ఉన్న రెండ చిన్నబావులు, అసలు వీటి నిర్మాణం వెనుక ఉన్న అంతర్ రహస్యం, తదితర ఆసక్తికర అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో నిరాదరణకు గురైన మెట్లబావిలో తవ్వకాలు చేపట్టి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని చరిత్రకారులు, ప్రజలు కోరుతున్నారు.
చరిత్ర అంటేనే మనకు పూర్వం.. నాటి కాలంలో ఎన్నో అద్భుత ఘట్టాలు.. రాజులు.. రాజరికం.. యుద్ధం. ఇలా ఎన్నో అంశాలు చరిత్రకు ఆనవాళ్లుగా నేటి, నాటి తరానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చారిత్రక నేపథ్యాన్ని కళ్ల ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎందుకంటే నాటి చరిత్ర నేటికి అద్భుతమే. కాకతీయుల సామ్రాజ్య ఏలుబడిలో ఎన్నో దృశ్యాలు నేటికి మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆ కోవలోనే మెట్లబావి(కోనేరు) మనల్ని అబ్బురపరుస్తోంది. మెట్ల బావి అంటే ఏమిటి? అందులో ఉన్న అద్భుతాల్లేమిటి? అనే ప్రశ్నలు ప్రతి మదిని తొలుస్తాయి. నిజంగా మెట్ల బావి అంతర్ రహస్యంతో కూడుకున్న బావి అనే కంటే ‘కోనేరు’ అంటే అందంగా ఉంటుంది. బావి నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎంతటి వారైనా అవాక్కైపోవాల్సిందే. ఎందుకంటే ఆ కోనేరు నిర్మాణం అలాంటిది మరి.
కోటకు అతి సమీపంలోనే..
ఖిలావరంగల్ కోటకు అతి సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారి పక్కన(శివనగర్) నిర్మితమైన నాటి కోనేరు పరిశీలకులకు సైతం అంతుచిక్కని అంశంగా మారింది. చుట్టూ ప్రహరీ మధ్య దిగేసి ఉన్నట్లు ఉన్న కోనేరుకు ఒంటరిగా వెళ్లాలంటే గుండె ధైర్యం కావాల్సిందే. తూర్పు దిక్కున ఉన్న ప్రధాన ద్వారం గుండా ఐదు అడుగులు ముందుకు నడిచి 10 మెట్లను దాటితేనే కోనేరు మొదటి భూగృహానికి చేరుకుంటాం. మరో 20 మెట్లు కిందికి దిగితే రెండో భూగృహానికి చేరుకోవచ్చు. అయితే రెండు భూగృహాలు మాత్రమే కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. మూడోది ఉన్నట్లు చాలామందికి తెలియదు. మొదటి రెండు భూగృహాల వరకు మెట్ల మార్గంలో వెళ్లొచ్చు. మూడో భూగృహానికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. అక్కడినుంచి నీటి అడుగు వరకూ మెట్లు ఉన్నాయి. అందమైన కట్టడాల మధ్య కొలువైన కోనేరు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతసేపు చూసినా మరీమరీ చూడాలనిపించే కోనేరు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.
అంతుచిక్కని రహస్యం?
మహాద్భుతంగా నిర్మించిన కోనేరు.. పరిసరాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో ఇక్కడ ఏదైనా ఆలయం గానీ లేదా రాజమందిరం ఉండే అవకాశం లేకపోలేదనే ప్రచారం ఉంది. సువిశాలంగా ఉన్న కోనేరుకు 40మీటర్ల దూరంలో 1.5 మీటర్లతో చతురస్రాకారంలో పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన రెండు చిన్న బావులున్నాయి. ప్రస్తుతం ఈ బావులను ఆయా స్థలాల యజమానులు పూడ్చివేశారు. పక్కనే పెద్ద కోనేరు ఉండగా రెండు చిన్నబావులను ఎందుకు నిర్మించారనే ప్రశ్న పర్యాటకులను తొలిచేస్తుంటుంది. అలాగే కోనేరు చుట్టూ ఇటుకతో గచ్చు నిర్మాణం కనిపిస్తుంది. ప్రస్తుతం బావి చుట్టూ సీసీ రోడ్డు వేయడంతో ఆ గచ్చు కనిపించకుండా పోయింది. కోనేరును పురావస్తు శాఖ స్వాధీనం చేసుకొని తవ్వకాలు చేపడితే అనేక రహస్యాలు బయటపడే అవకాశముందని, ఫలితంగా కాకతీయులకు గానీ అప్పటి ప్రజలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు బయటపడుతాయని పలువురు పేర్కొంటున్నారు.
ఆకట్టుకునే నిర్మాణ శైలి
కోనేరు నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. నలువైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంది. కోనేరుకు దక్షిణం నుంచి 1.8 మీటర్ల వెడల్పుతో ఉన్న మార్గం నుంచి కిందికి పది మెట్లు దిగితే మొదటి భూగృహం వస్తుంది. మొదటి భూగృహం వద్ద మెట్లకు ఇరువైపులా ఉన్న ద్వారం నుంచి 7.95 మీటర్లు ముందుకు వెళ్తే కోనేరు గంభీరంగా కనిపిస్తోంది. 1.84 మీటర్ల ఎత్తుతో తూర్పు, పశ్చిమ దిశలో ఏడేడు కలిపి 14 పిల్లర్లు, ఉత్తర, దక్షిణ దిశలో 20 పిల్లర్లు పైఅంతస్తును కాపాడుతూ కనిపిస్తోంది. అలాగే మొదటి భూగృహంలోని బావి చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒకవైపు పిల్లర్లు ఉంటే మరోవైపు భూగహృం గోడ ఉంటుంది. కోనేరు పైభాగాన 14 మీటర్ల చతురస్రాకారంలో ఉంటే మొదటి భూగృహానికి వెళ్లాక లోపల 18 మీటర్ల వెడల్పులతో ఉంది. అలాగే అక్కడినుంచి మరో 20 మెట్లు కిందికి వెళ్తే రెండో భూగృహం వస్తుంది. అక్కడున్న ఓ భారీ భద్రపీఠంపై నాటి మహిళల వస్త్రధారణను తెలియజేసే శిల్పాలుండడం విశేషం. అయితే మూడవ భూగృహానికి వెళ్లేందుకు భూగర్భ జలాలు అడ్డుగా ఉన్నందున వేసవి కాలంలో మాత్రమే చూసే వీలుంటుంది.
సుందరీకరణ దిశగా తెలంగాణ సర్కారు
చారిత్రక కట్టడాలను సంరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. ఇందులో భాగంగానే చారిత్రక కోనేరును అందంగా ముస్తాబు చేసేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎంఏ నిధులతో చుట్టూ ప్రహరీ నిర్మాణం, బావిలోని నీటిని శుద్ధి చేయడంతో పాటు లోపల గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇటీవల మెట్ల బావిని సందర్శించిన ఎమ్మెల్యే నరేందర్ మరింత అభివృద్ధి చేస్తానని చెప్పడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.