ప్రతి ఊరినీ పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి ఐదో విడుత, పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమాలు రెండో రోజూ జోరుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు శనివారం ఆయా గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు చేయించగా ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారాన్ని, ముళ్లపొదలను తొలగించారు. పల్లెల్లో అధికారులు సభలు నిర్వహించి పల్లె ప్రగతి ఆవశ్యకతను వివరించారు.
నమస్తే నెట్వర్క్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకుసాగగా, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది, ప్రజలు డ్రైనేజీలను శుభ్రం చేయడంతోపాటు రోడ్లకిరువైపులా చెత్తాచెదారం, ముళ్లపొదల తొలగింపు వంటి పనులు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి, తీగలవేణి గ్రామాల్లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై అవగాహన కల్పించారు. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌లో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్, అయోధ్య గ్రామాల్లో కలెక్టర్ శశాంక పర్యటించారు. ముడుపుగల్, అయోధ్య గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని పల్లెప్రగతి ఆవశ్యతను ప్రజలకు వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ భవేశ్‌మిశ్రా పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు 20, 21వ వార్డుల్లోని శాంతినగర్, హనుమాన్ నగర్లోపనులను పరిశీలించారు. రోడ్లకిరువైపులా పిచ్చి మొక్కల తొలగింపుతోపాటు డ్రైనేజీలను శుభ్రం చేయించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం, మంగళిబండ తండాలను జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సందర్శించారు. పల్లెప్రగతిలో చేపట్టాల్సిన పనులను గ్రామస్తులకు వివరించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్లోని పలు కాలనీల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ 2.27కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 21వ డివిజన్ ఎల్బీనగర్లో, సంగెం మండలం గవిచర్ల, రాంచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు. 20వ డివిజన్లోని పద్మానగర్, శాంతినగర్ ప్రాంతాల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య పర్యటించి పట్టణప్రగతి పనులు పరిశీలించారు.
