పరకాల, జూలై 30 : అత్యవసర సమయంలో అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు రూ.13.64 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం కేసీఆర్ సీఎం సహాయ నిధి ద్వారా అర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. పేదలు సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, పరకాల వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పలు మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దామెర : పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీవర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దామెర మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీవర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో దళిత బంధు సమితి మండల కన్వీనర్ గరిగె కృష్ణమూర్తి తల్లి, జడ్పీటీసీ కల్పన అత్తమ్మ గరిగె పోచమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.