కాజీపేట, జూలై 26: కోర్టులో కేసు తేలేదాక గిరిజన రిజర్వేషన్లు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో రిజర్వేషన్ల పెంపుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. కాజీపేట పట్టణం 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50 ఏండ్ల క్రితం నాటి జనాభా దామాషా ప్రకారం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తోందని, దీంతో దళిత, గిరిజనులు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
అగ్రవర్ణాలకు మాత్రం కేంద్రం ఇష్టారాజ్యంగా రిజర్వేషన్ పెంచుకుంటూపోతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో సీఎం కేసీఆర్ ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 10 రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారని తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్లో గళమెత్తినా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. 2017లో ఎస్టీ రిజర్వేషన్ పెంపు కోసం మినిస్ట్రీస్ ఆఫ్ లైటర్ అఫ్పైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్రం నుంచి సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటేశం పాల్గొని విధి విధానాలను రూపొందించారని తెలిపారు.
ఐదేళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీఈ రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టులో వేసిన కేసుతో ముడిపడి ఉందని, అందుకే కోర్టు తీర్చు వచ్చేవరకు గిరిజనుల రిజర్వేషన్ పెంచడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 50 ఏండ్లుగా రిజిర్వేషన్ పెంపుదలపై సమీక్షలు జరుపకుండా ఏదో సాకు తో గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నాన్చకుండా వెంటనే జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
న్యాయపరంగా ఎస్టీ, ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే జాతిబిడ్డలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గిరిజన, దళిత విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, కుల, తదితర సంఘాలతో చేపట్టే రిజర్వేషన్ పోరాట కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సమావేశంలో బానోత్ సంగులాల్, బానోత్ సింగ్‌లాల్, సాంబయ్య నాయక్, గుగులోత్ గోపీసింగ్, బానోత్ నర్సింహనాయక్, వినోద్లాక్ నాయక్, రాజునాయక్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి పాల్గొన్నారు.