వనపర్తి, డిసెంబర్ 2(నమస్తేతెలంగాణ): రెండు పంటలు వరి పండిస్తే లేనిపోని యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొదటి పంటగా మాత్రమే వరి వేయాలని రైతులకు సీఎం సూచించారు. గురువారం గద్వాలలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపురంతో పాటు కొత్తకోట మండలంలోని విలియంకొండ వద్ద ఆగి ఆరుతడి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆరుతడి పంటలు వేయడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా పంటలకు చీడపురుగుల బెడద ఉండదని, రాజకీయ చీడపురుగుల బెడద కూడా ఉండదని సీఎం అన్నారు. పంటల సాగుపై కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆరుతడి పంటలకు మద్దతు ధర కూడా లభిస్తుందని తెలిపారు. రంగాపురంలో మినుము, వేరుశనగ పంటలను మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కలెక్టర్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పరిశీలించారు. రైతులు, అధికారులు, మంత్రుల నుంచి పంట దిగుబడి, పెట్టుబడి, మద్దతు ధరల వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు.
రైతులతో ముఖ్యమంత్రి మాటామంతి