న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశీ కార్పొరేట్లు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల్ని 9.9 శాతం మేర పెంచగలమన్న ధీమాతో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్నందున 2022లో వేతనాల పెంపు గతేడాదికంటే అధికంగా ఉంటుందని కార్పొరేట్ సంస్థలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ వృత్తినిపుణుల సేవల సంస్థ అయాన్..ఇండియాలో నిర్వహించిన వేతన పెంపు సర్వేను బుధవారం విడుదల చేసింది. 2021లో వేతనాల సగటు పెంపు 9.3 శాతంగా ఉందని, ప్రస్తుత ఏడాది ఈ పెంపు 9.9 శాతానికి పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న కార్పొరేట్ ప్రతినిధులు వెల్లడించారని అయాన్ తెలిపింది. 40కిపైగా పారిశ్రామిక రంగాలకు చెందిన 1,500 కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి, ఈ అధ్యయనాన్ని తయారు చేశారు. వివరాలివి..
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు 2021లో రెండు దశాబ్దాల గరిష్ఠస్థాయికి చేరిందని అయాన్ సర్వే వెల్లడించింది. గత 6-8 నెలలుగా నిపుణుల కోసం కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా వలసల రేటు 21 శాతానికి పెరిగిందని, 2003 తర్వాత ఇదే గరిష్టమని సర్వేలో తేలింది. 2020లో వలసల రేటు 12.8 శాతంగా ఉంది.