హైదరాబాద్, అక్టోబర్ 4, నమస్తే తెలంగాణ: లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును హరించే విధంగా ఎలాంటి ప్రక్రియ చేపట్టినా దాన్ని సమర్థించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. ఓటు హక్కును కోల్పోయేలా చేసే చర్యలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని, అలాంటి చర్యలను ఏ న్యాయస్థానమూ ఆమోదించజాలదని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, పౌరుడికి తన దేశ పాలనలో భాగస్వామ్యం కల్పించే అత్యంత కీలకమైన సాధనమని చెప్పారు.
హైదరాబాద్లో ఆదివారం జరిగిన 19వ నల్సార్-జస్టిస్ బి.ఆర్. సాహ్నీ మెమోరియల్ మూట్ కోర్టు పోటీల ముగింపు కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాదని, రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఓటు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అదే పునాది అని జస్టిస్ భుయాన్ అన్నారు.
ఓటు హక్కు ఉన్న పౌరులు, లేని పౌరులు అంటూ దేశంలో రెండు తరగతుల పౌరులు ఉండటానికి రాజ్యాంగం అనుమతించదన్నారు. లక్షలాది మంది భారతీయులను ఓటు హక్కు లేని పౌరులుగా మార్చే ప్రక్రియ రాజ్యాంగ వ్యవస్థను తిరస్కరించడమే అవుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును పౌరసత్వం నుంచి వేరు చేయలేమని, పౌరుడి శరీరం నుంచి ఆత్మను వేరు చేసినట్లే ఓటు హక్కును తొలగించడం అవుతుందని వ్యాఖ్యానించారు.
ఓటు హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో పేర్కొన్నప్పటికీ, రాజ్యాంగంలోని 326వ అధికరణం ద్వారా సంక్రమించిన రాజ్యాంగ హక్కు అని జస్టిస్ భుయాన్ వివరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం నిర్దిష్ట నిబంధనలకు అనుగుణంగానే జరగాలని చెప్పారు. చనిపోయిన ఓటరు విషయంలో మినహా, నోటీసు, విచారణ లేకుండా ఓటరు పేరును తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఓటు హక్కును నియంత్రించే చట్టాలు రాజ్యాంగంలోని 325, 326 అధికరణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు.
వాటికి విరుద్ధంగా ఉండే చట్టాలు చెల్లుబాటు కావని పేర్కొన్నారు. ఓటు హక్కును పరిమితం చేసే పరిపాలనా చర్యలు కూడా హేతుబద్ధంగా, సమంజసంగా ఉండాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఆకాంక్షగా రూపుదిద్దుకుందని, రాజ్యాంగ నిర్మాణంలో పునాది సూత్రంగా నిలిచిందని తెలిపారు. ఆర్థిక, సామాజిక స్థాయిలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి దేశ పాలనలో సమాన భాగస్వామ్యం కల్పించేది ఓటు హక్కేనని చెప్పారు. 326వ అధికరణాన్ని ఇష్టానుసారంగా మార్చడానికి ఎవరికీ అధికారం లేదని, రాజ్యాంగానికి మించిన అధికారం ఏ సంస్థకూ లేదని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు.