
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో అరుదైన విశ్వకర్మ విగ్రహం లభించింది. శైలిరీత్యా ఇది చాళుక్య- కాకతీయుల నాటిదిగా తెలుస్తుందని పబ్లిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా) ఉపాధ్యక్షుడు, పరిశోధకుడు డాక్టర్ దామరాజు సూర్యకుమార్ తెలిపారు. విశ్వకర్మ పక్కనే మమ్మాయి దేవత సైతం ఉండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత అని, ఇప్పటివరకు తెలంగాణలో దొరికిన వాటిలో ఈ తరహా విగ్రహం ఇదొక్కటే అని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఇది లభించడానికి కారణం ఈ ప్రాంతమంతా వేలఏండ్లుగా ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో నిమగ్నమై ఉండటమేనని ప్రిహా అధ్యక్షుడు డాక్టర్ పెరుంబుదూర్ జైకిషన్ తెలిపారు. ఇక్కడ విస్తృత పరిశోధనలు చేస్తే ఇలాంటి ఆధారాలు, శిల్పాలు మరెన్నో దొరికే అవకాశం ఉందని పేర్కొన్నారు. అరుదైన శిల్పాన్ని గ్రామంలో సరైన ప్రదేశంలో సంరక్షించాలని, రాష్ట్ర హెరిటేజ్ శాఖ దీనిని రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.