‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’, ‘పాగల్’ వంటి యూ త్ఫుల్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు హీరో విశ్వక్ సేన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మే 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాలు తెలిపారు.
‘పాగల్’ తర్వాత యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. ఈ కథ చెబుతానంటే వద్దని తప్పించుకుని తిరిగాను. కానీ ఒకసారి కథ విన్నాక చేయకుండా ఉండలేకపోయాను. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘బొమ్మరిల్లు’ వంటి ఘన విజయాలు సాధించిన చిత్రాలెన్నో కుటుంబ కథలతోనే తెరకెక్కాయి. పెళ్లి చేసుకోవద్దు అనుకునే యువతకు మా చిత్రాన్ని చూశాక వివాహం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా చూసుకున్నాను. చాలా నమ్మకంతో ఉన్నాం. బాగా వచ్చింది. క్లీన్ యూ సర్టిఫికెట్ రావాల్సిన సినిమా ఇది. ఒకట్రెండు చిన్న డైలాగ్స్‌తో యూఏ ఇచ్చారు. రైటింగ్ పరంగా బలంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. మళ్లీ చెబుతున్నా, ఇది నా కెరీర్ బెస్ట్ ఫిలిం.
నటుడిగా ఇలాంటి కథల్లోనే నటించాలని పరిమితులు పెట్టుకోలేదు. మహిళ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమే. ‘బ్రహ్మచారి’ చిత్రంలో కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. ‘ధమ్కీ’ సినిమాకు నేనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నా. ఆ కథను దర్శకుడి కన్నా నేనే ఎక్కువ అర్థం చేసుకున్నా. అందుకే మనం మరో సినిమా చేద్దామని దర్శకుడు నరేష్‌కు చెప్పి నేను మెగాఫోన్ పట్టా. ‘ఓరి దేవుడా’ సినిమా రిలీజ్‌కు ఉంది. ‘స్టూడెంట్’తో పాటు మరికొన్ని సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. ప్రచారం కోసం చేసిన పనులు మళ్లీ చేయను. అందుకే ఇకపై ప్రాంక్ వీడియోలు చేయొద్దని అనుకుంటున్నా. నాకు ఎవరి నుంచీ బెదిరింపు కాల్స్ రాలేదు.