Laatti Movie Teaser | కోలీవుడ్ స్టార్ విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరుకు తమిళ హీరో అయినా కూడా తెలుగబ్బాయి కావడంతో మన ప్రేక్షకులు ఈయనను బాగానే ఆదరిస్తారు. 2005లో వచ్చిన ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విశాల్ పరిచయమయ్యాడు . అప్పటి నుండి ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో ‘లాఠీ’ ఒకటి. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
‘రేయ్ తప్పుచేసి తల దాచుకునే పోకిరివి.. నీకే అంత పొగురుంటే, ఆ తప్పును నిలదీసే పోలీసోడ్ని నాకెంతుండాలి’ అంటూ టీజర్ ప్రారంభమైంది. టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫుల్‌గా నిండి ఉంది. విశాల్ పోలీస్ పాత్రల్లో నటించడం కొత్తేమి కాదు. కానీ ఈ సారి మాస్ వేరే లెవల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. టీజర్ చివర్లో ‘ఊర్లో ఉన్న పోకిరి పోరంబోకులందరూ ఒకటై నన్ను లేపేయడానికి ఎదురు చూస్తున్నారు కదరా..ఇక్కడి నుంచి ఒక్కడు ప్రాణాలతో వెళ్ళడు. ఇప్పుడు రండ్రా’ అంటూ విశాల్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 11న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ రెండు సార్లు మేజర్‌గా గాయపడటంతో చిత్రీకరణ లేట్ అయింది. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 15కు పోస్ట్ పోన్ చేశారు. సునైనా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నంద సంయుక్తంగా నిర్మించారు.