E-Taste | న్యూఢిల్లీ: నోరూరించే వంటకాలను టీవీ షోలలో తయారు చేస్తూ ఉంటే, వాటిని చూడటంతో సరిపెట్టుకునే కాలానికి ఇక తెర పడనుంది. టీవీ తెరలపై కనిపించే ఈ వంటకాల రుచిని ప్రేక్షకులు ఆస్వాదించే రోజులు వస్తున్నాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన పరికరం ఈ అనుభూతిని పంచుతుంది. ఈ పరికరంలోని సెన్సర్స్ ఆహారం రుచిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా అంది పుచ్చుకొని రిమోట్ పరికరానికి అందిస్తుంది.
ఆ రిమోట్ ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని, ఆ ఆహారం రుచులను రసాయనాల రూపంలో వెల్లడిస్తుంది. టీవీ ముందు కూర్చున్న వ్యక్తి కింది పళ్లపై ఓ పరికరాన్ని ఉంచితే, అది జెల్స్ రూపంలో ఈ రసాయనాలను ఆ వ్యక్తి నోటిలోకి పంపుతుంది. టీవీ తెరపై కనిపించే ఆహార పదార్థాల అసలు రుచుల మాదిరిగానే ఈ రుచులు కూడా ఉంటాయి.
తీపి, ఉప్పు, చేదు, కారం, లేదా వీటన్నిటి మిశ్రమం స్పష్టంగా తెలుస్తుంది. ఈ టెక్నాలజీని కేవలం ఆహారాన్ని రుచి చూడటానికి మాత్రమే కాకుండా.. ఆన్లైన్ షాపింగ్, రిమోట్ ఎడ్యుకేషన్, వెయిట్ మేనేజ్మెంట్, సెన్సరీ టెస్టింగ్ వంటివాటి కోసం కూడా ఉపయోగించవచ్చునని ఈ శాస్త్రవేత్తలు తెలిపారు. మెదడుకు గాయాలైనవారికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.