తిరుమల : తిరుమల(Tirumala) లో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 1 నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 30న సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని తెలిపారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను(Annual Brahmotsavams) అత్యంత వైభవంగా నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. వేడుకల దృష్ట్యా అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశామన్నారు.
సంవత్సరానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంట ఏకాదశి , వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే ముందు మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఆచారాన్ని దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 1న ప్రోటోకాల్ వీఐపీలు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు సహకరించాలని కోరారు.