దామరచర్ల, జూన్ 30 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. తమ సమస్యలను మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు తెలిపేందుకు బయల్దేరిన సుమారు 400 మందిని దామరచర్ల శివారులో వాడపల్లి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మిర్యాలగూడ రూరల్ సీఐ ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని రహదారిపై ఆందోళన చేయడం సరికాదని, స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో అధికారులతో చర్చిస్తామని తెలుపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించి తాసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయబ్ తాసీల్దార్ సైదులుకు అందజేశారు. గ్రామస్తుల సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని తెలుపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయం సేకరణలో అధికారులు బాధిత వీర్లపాలెం గ్రామంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని, కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు తమ గ్రామానికి ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, పలుమార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
Damaracharla : యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించాలని వీర్లపాలెం గ్రామస్తుల ఆందోళన