సంగారెడ్డి : ఫార్మాసిటీపై(Pharmacy city) రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తమకు జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదంటూ భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. నిన్నటికి నిన్న భూములు ఇచ్చే ప్రసక్తే లేదని సంగారెడ్డి జిల్లా(Sangareddy) న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రమైన న్యాల్కల్లోని ప్రధాన వీధు ల గుండా ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, భూబాధితులు, ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోని న్యాల్కల్-ముంగి ప్రధాన రోడ్డు మార్గంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా న్యాల్కల్లో ఫార్మా సిటీ భూసేకరణ నిరసిస్తూ ఫార్మాసిటీ భూ బాధితులు డప్పుర్ కార్యదర్శిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తామని, వాటిని మాత్రం వదులుకునేది లేదని, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భయపడేదిలేదని స్పష్టం చేశారు. తమ గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు.