Sigma Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాపై ఊహించని ప్రభావం చూపుతోంది. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా ‘సిగ్మా’ (Sigma). ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పనుల్లో బిజీగా ఉండటం మరియు ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే మీడియా నుండి ఎదురయ్యే రాజకీయ సంబంధిత ప్రశ్నలు జేసన్ సంజయ్‌ను ఇబ్బంది పెడతాయని, అది సినిమాపై ఉన్న శ్రద్ధను పక్కదారి పట్టిస్తుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది.
మొదట ఈ చిత్రాన్ని 2025 చివరలో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజా రాజకీయ పరిణామాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం సందీప్ కిషన్ అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. విజయ్ రాజకీయ తుపాను తగ్గిన తర్వాతే జేసన్ సంజయ్ తన దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది.