Vijay Devarakonda – Waves 2025 | ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ముంబై వేదికగా జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025)’లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందని విజయ్ తన మనసులోని కోరికను బయటపెట్టారు.
చిత్రనిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసి పనిచేస్తే ఆ సినిమాలు దేశాన్ని సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా ఏకం చేస్తాయని అభిప్రాయపడ్డారు. షారుఖ్ ఖాన్ నటించిన చివరి చిత్రం దాదాపు రూ. 800-1000 కోట్లు వసూలు చేసిందని, అల్లు అర్జున్ చిత్రం కూడా రూ. 1000 కోట్ల మార్కును దాటిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఇద్దరు వేర్వేరు ప్రాంతాల తారలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే, అది దేశాన్ని ఏకం చేయడమే కాకుండా నిజమైన పాన్-ఇండియన్ సినిమా అనుభూతిని కలిగిస్తుందని విజయ్ పేర్కొన్నారు. నార్త్, సౌత్ ఫిల్మ్ సినిమాల మధ్య జరుగుతున్న చర్చలు అనవసరమైన విషయాలని ఆయన అన్నారు. పోటీ కంటే సహకారం చాలా మంచిదని, ఇదే భారతీయ సినిమా పరిశ్రమకు మరింత సానుకూలమైన దృక్పథం అని ఆయన అభిప్రాయపడ్డారు. సౌత్ ఇండియన్ సినిమాకు జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోందని ఆయన అన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్డమ్’ అనే స్పై థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, ఆయన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం డిసెంబర్ 5, 2024న విడుదలైంది. ఆ తర్వాత ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు, ఇది 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Exclusive: Vijay Deverakonda at #WAVES2025 – “If we have to take on the giants of the world, we need to collaborate. Like both Shah Rukh Khan sir’s & Allu Arjun anna’s film did 1000 cr now imagine if they collaborate. Two biggest stars from North & South to unite the country.” pic.twitter.com/rQyCTYJMTd
— ℣ (@Vamp_Combatant) May 2, 2025