హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరిన కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ అస్ర్తాన్ని సర్కార్ సంధించింది. బుధవారం ఒక్కరోజే 12 కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఒక్కో కాలేజీలో 10 -12 మందితో కూడిన బృందం తనిఖీలు నిర్వహించింది. వాసవి, మాతృ శ్రీ, స్టాన్లీ, ఏస్ వంటి కాలేజీల్లో తనిఖీలు జరిగాయి. విద్యార్థుల అటెండెన్స్, వేతనాలు, ఫ్యాకల్టీ, సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అవకతవకలు, ల్యాబ్లు, ఆర్థిక లావాదేవీలు వంటి 67 అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో ఒకే విద్యార్థి రెండు స్కాలర్షిప్స్ పొందారని వ్యాఖ్యానించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతామని అన్నారు.