అయిజ : విత్తన దుకాణాలపై రాష్ట్ర విజిలెన్స్ (Vigilance) , ఎన్ఫోర్స్మెంట్( Enforcement ) అధికారులు దాడులు (Raid ) చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణేష్, ఏసీటీవో సురేష్, ఎస్సై శ్రీరామ్, కేటీదొడ్డి ఏవో సాజిద్ రహమాన్ తదితర అధికారులు విత్తన దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తన డీలర్లు రైతులకు ఎంఆర్పీ(MRP) ధరలకే విక్రయిస్తున్నారా, రసీదులను ఇస్తున్నారా లేదా, స్టాక్ రిజిస్లర్లలో వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎంఆర్పీ ధరల కంటే అధికంగా అమ్మినా, రసీదులను ఇవ్వకపోయినా చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు.
పట్టణంలోని సాయిరాం హైబ్రీడ్ సీడ్స్, శాంతి సీడ్స్, సాయిరాం సీడ్స్ తదితర దుకాణాల్లో తనిఖీ చేసినట్లు ఏవో జనార్దన్ తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను రైతులకు అమ్మే అవకాశాలు ఉండటంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విత్తన దుకాణాలు, రసాయనిక, ఎరువుల దుకాణాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.