చిక్కడపల్లి, జూలై 13: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఆయన బావమరిది ఎస్ సత్యనారాయణరావు, వారి గుండాల దౌర్జన్యాల నుంచి తమ ఇండ్ల స్థలాలకు రక్షణ కల్పించాలని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. భూ బకాసురుడైన ప్రేమ్‌సాగర్‌రావుకు మద్దతు ఇవ్వకుండా తమలాంటి పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
శనివారం ఇందిరాపార్కు వద్ద బాధితులు నిర్వహించిన ధర్నాలో సొసైటీ అధ్యక్షుడు వెంటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జీబీ రెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా గ్రామ పంచాయతీ అనుమతితో తాము 639/1,643/1,644/ 1,647/1,648,654 సర్వే నంబర్లలో పట్టాదారుల నుంచి 61 ఎరాల భూమిని కొనుగోలు చేసి, 708 ప్లాట్లుగా విభజించుకున్నామని వివరించారు. వాటిలో కొన్ని ప్లాట్లను తప్పుడు అగ్రిమెంట్లతో ప్రేమ్‌సాగర్‌రావు ఆక్రమించాడని, ఆ ప్లాట్ల చుట్టూ తాము కట్టుకున్న ప్రహరీ గోడలను కూల్చివేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొందరు ఓనర్లను బెదిరించి దాదాపు 150 ప్లాట్లను అతి తక్కువ ధరకే తీసేసుకున్నట్టు తెలిపారు. మిగిలిన 556 మంది ఓనర్లు తమ ప్లాట్లను అమ్మకపోవడంతో ప్రేమ్‌సాగర్‌రావు అక్రమ కేసు పెట్టాడని, తద్వారా ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టుకోనీయకుండా ఓనర్లను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. ‘ప్రజాదర్బార్’లో అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదని తెలిపారు. ప్రేమ్‌సాగర్‌రావు, ఆయన అనుచరుల దురాగతాలను అడ్డుకుని తమ ప్లాట్లలో ఇండ్లు కట్టుకునేందుకు వీలుకల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌ను కోరారు.