హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు. ఆయన మృతితో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముద్రగడకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. పద్మనాభం 1978లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆ తరువాత 1983, 1985, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కాకినాడ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. ఆయన మొదటి నుంచి రాజకీయ పదవుల కంటే కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని చేసిన పోరాటాలతో తెలుగు రాష్ర్టాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏడు సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన సేవలను కొనియాడారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర దవాఖానకు వెళ్లి ముద్రగడ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ముద్రగడ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేస్తూ, ‘నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నాయకుడు’ అని కొనియాడారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన గొప్ప ప్రజానాయకుడని, కాపు వర్గాల అభ్యున్నతి కోసం, రాజ్యాంగం కల్పించిన హకుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముద్రగడ మరణం సామాజిక ఉద్యమాలకు తీరనిలోటు అని పేరొన్నారు. వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముద్రగడ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు సేవలందించారని, కాపు సామాజికవర్గ హకుల కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేరొన్నారు. ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేసి, నిరంతరం పోరాడిన నాయకుడిగా ముద్రగడ గుర్తింపు పొందారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.