హాస్యనటుడు వేణు యల్దెండి తీసిన ‘బలగం’ సినిమా తెలంగాణ బతుకు చిత్రంగా కితాబులందుకున్న విషయం విదితమే. తెలంగాణ పల్లె పల్లెల్లో తెరలుగట్టి మరీ ప్రదర్శించిన సినిమా ఇది.దర్శకుడు వేణు మలి ప్రయత్నం కోసం మూడేళ్లుగా తెలుగువారంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. తన రెండో సినిమాగా ఆయన ‘ఎల్లమ్మ’ను ప్రకటించారు. అప్పట్నుంచీ అడుగడుగునా అవాంతరాలే. ఇందులో హీరోగా చాలామంది పేర్లు వినిపించినా.. ఎవరూ అధికారికంగా ఖరారు కాలేదు. ఓ దశలో సినిమా ఉంటుందా? అనే అనుమానం కూడా జనాల్లో ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ కథానాయకుడు ఖరారయ్యాడు. సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’లో హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంక్రాంతి రోజున మేకర్స్ ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవిశ్రీ హీరోగా నటించడమే కాక, సినిమాకు సంగీతం కూడా అందిస్తున్నారు. దైవిక శక్తి నేపథ్యంగా, స్థానిక సంప్రదాయాలు, జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాల మేళవింపుగా ‘ఎల్లమ్మ’ రూపొందనున్నదని గ్లింప్స్ చెబుతున్నది. స్టన్నింగ్ విజువల్స్‌తో గ్లింప్స్ సాగింది. సుడిగాలిలో ఎగురుతున్న ఓ ఒంటరి వేపాకు.. దాన్ని గమనిస్తున్న ఓ గొర్రెపోతు.. కాళ్లకు గజ్జెలతో పరుగెడుతున్న ఓ వ్యక్తి, మరోవైపు షూస్‌తో పరిగెడుతున్న మరో వ్యక్తి.. ఇలా అంతుచిక్కని ఉత్కంఠ వాతావరణం గ్లింప్స్‌లో కనిపించింది.
గాలిలో ఎగురుతున్న వేపాకు మేఘాలను తాకి క్షణాల్లో అమ్మవారి దివ్యరూపంగా మారింది. జోరుగా కురుస్తున్న వానలో ఓ కాలువ గట్టున ఓ పెద్ద చెట్టుకు కొడవలి గుచ్చి ఉంది. ఆ పక్కనే ఒంటిపై చొక్కా లేకుండా ఒక వ్యక్తి నడుముకు డోలు కట్టుకొని రాయిపై కూర్చునివున్నాడు. వేపాకు ఎగురుకుంటూ వచ్చి అతని వెనుక వాలింది. నిదానంగా వెనక్కు తిరుగుతూ ‘పర్షి’గా దేవిశ్రీప్రసాద్ రివీలయ్యారు. పొడవాటి జుట్టుతో, రగ్గడ్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపించారాయన. దేవిశ్రీ నేపథ్య సంగీతం గ్లింప్స్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నిర్మిస్తున్నట్టు గ్లింప్స్ ద్వారా వెల్లడించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.