Venezuela | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనక్కి తగ్గారు. తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని అమెరికాకు పిలుపునిచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఇప్పుడు అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.
అంతర్జాతీయ చట్టాల పరిధిలో, పరస్పర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని రోడ్రిగ్జ్ ప్రకటించారు. దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేసే ఎజెండాతో తన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రోడ్రిగ్జ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే మదురోను అమెరికా బలగాలు పట్టుకెళ్లినప్పుడు మాత్రం ఆ చర్యను రోడ్రిగ్జో తీవ్రంగా వ్యతిరేకించారు. మదురోను వెంటనే వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశానికి ఒకరే అధ్యక్షులుగా ఉన్నారు.. ఆయనే మదురో అని పేర్కొన్నారు.
అయితే, రోడ్రిగ్జో తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అమెరికాను ఎదిరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే.. మదురో కంటే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రోడ్రిగ్జో వెనక్కి తగ్గి.. అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం.