Veligonda Project | శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయడంతో ముంపు ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఈ ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురు సమీపంలోని చెట్టుపైకి చేరి ప్రాణాలు కాపాడుకోగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల ముంపు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టిన సమయంలోనే నలుగురు వ్యక్తులు అరటి కాయలు కోసేందుకు బయటకు వెళ్లినట్లు సమాచారం. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని నీటి ప్రవాహాన్ని బొలెరో వాహనంలో దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వాహనం అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయింది. వాహనం నుంచి బయటపడిన నలుగురిలో ముగ్గురు సమీపంలోని చెట్టును పట్టుకుని పైకి ఎక్కారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి కిందకు దిగే పరిస్థితి లేకపోవడంతో తమను కాపాడాలంటూ సహాయం కోసం కేకలు వేశారు. మరో వ్యక్తి మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత, డీఎస్పీ యు. నాగరాజు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వెంటనే చెట్టుపై ఉన్న వారిని చేరుకోవడం కష్టంగా మారింది.
అనంతరం నీటి ప్రవాహాన్ని కొంతమేర తగ్గించే చర్యలు చేపట్టడంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చివరకు చెట్టుపై చిక్కుకున్న ముగ్గుర్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.