Ravi Teja | మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ మంచి విజయాన్ని అందుకోవడంతో రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమాల విషయంలో మరింత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ.. ఇప్పుడు తొలిసారి ఓ కొత్త జానర్‌ను టచ్ చేయబోతున్నాడనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ తన కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు చేశాడు. అయితే హారర్ కామెడీ జానర్లో మాత్రం ఇప్పటివరకు పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఓ హారర్ కామెడీ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. విభిన్నమైన కథలను, కొత్త తరహా స్క్రీన్‌ప్లేలను తెరకెక్కించడంలో పేరున్న వివేక్ ఆత్రేయ.. రవితేజ కోసం కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. కథ వినగానే రవితేజకు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజకు హారర్, కామెడీ కలిసిన కథ ఎంతవరకు సెట్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా రవితేజ కామెడీ టైమింగ్‌కు హారర్ ఎలిమెంట్స్ జోడిస్తే థియేటర్లలో మంచి ఎంటర్టైన్మెంట్ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్స్‌పై మేకర్స్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్, ఇతర నటీనటుల వివరాలు, షూటింగ్ ప్రారంభ తేదీ వంటి విషయాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.మరోవైపు రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు కూడా ఓకే చెప్పాడు. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి రవితేజ ఓ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్లో నటించనున్నాడు. ‘ఇరుముడి’ విజయంతో మంచి ఊపుమీదున్న రవితేజ.. ఇకపై వరుసగా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.