నిజామాబాద్, నవంబర్ 06, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో భారీ కుదుపు. అక్రమాల తంతుకు మరో చెంప పెట్టు లాంటి తీర్పు. ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉండే టీయూ మరోసారి రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీసింది. అక్రమాలే ఊపిరిగా సాగుతోన్న పరిపాలన తీరుతెన్నులకు హైకోర్టు బ్రేక్ వేసింది. 2012లో జారీ చేయబడిన మూడు నోటిఫికేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగిన విచారణ పర్వంలో హైకోర్టు గమనించిన అంశాలను 24 పేజీల్లో పొందుపర్చింది. 13 మంది ప్రొఫెసర్లు, 30 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు అన్నీ చట్ట విరుద్ధంగా జరిగాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ నగేశ్ భీమపాక తన తుది తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్ల స్థానంలో నూతనంగా భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు తెలంగాణ యూనివర్సిటీకి స్వేచ్ఛను కల్పించింది. తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించేందుకు వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరిలు స్పందించేందుకు నిరాకరించారు.
శభాష్ వెంకట్ నాయక్…
రోస్టర్ పాయింట్లు ఇష్టారీతిన మార్చడం ద్వారా ఐప్లెడ్ ఎకనామిక్స్‌ను జాబితాలో మొదటి స్థానంలో చూపి హిందీ పోస్టు ఓసీకి మార్చారు. వాస్తవానికి ఇదీ ఎస్టీకి రావాల్సింది. ఈ పోస్టు న్యాయంగా ఎస్టీకి కేటాయించి ఉంటే వరంగల్ జిల్లాకు చెందిన వెంకట్ నాయక్ అనే వ్యక్తికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చేది. తెర వెనుక ఏమి జరిగిందో ఏమో కానీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వెంకట్ నాయక్‌కు ఉద్యోగం రాకపోవడంతో ఆయన తీవ్రంగా కుంగిపోయాడు. తనకు అన్యాయం జరిగిందని గుర్తించి 10 మంది బాధితులతో కలిసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి 2012 నియామకాలపై స్టే తీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాలను నాటి వీసీ అక్బర్ అలీఖాన్, పాలకవర్గం పెడచెవిన పెట్టి అక్రమ నియామకాలకే జై కొట్టారు. అనేక ఇబ్బందులు, బెదిరింపు ఎదురైనప్పటికీ వెంకట్ నాయక్ తనకు జరిగిన అన్యాయంపై పోరాడి చివరకు 2012లో జారీ చేయబడిన మూడు నోటిఫికేషన్లను రద్దు చేయించే వరకు విశ్రమించలేదు. నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కచ్చితమైన ఆధారాలను హైకోర్టుకు సమర్పించి చివరకు న్యాయాన్ని నిలబెట్టారు.
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన నాటి వీసీ…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నియామకాలకు కీలక బింధువు నాటి వైస్ ఛాన్స్లర్ అక్బర్ అలీఖాన్. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ నియమాలు పూర్తిగా కాలరాయడం, అర్హత లేని వారికి ఇంటర్వ్యూలకు పిలిపించడం, చాకచక్యంగా అర్హులను తప్పించడం, స్క్రీనింగ్ కమిటీ, సెలెక్షన్ కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం అనేకం హైకోర్టు విచారణలో వెలుగు చూశాయి. యూజీసీ 2009 రెగ్యులేషన్స్, ఏపీ యూనివర్సిటీ యాక్ట్ 1991 ఉల్లంఘనలు ఈ నియామకాల్లో జరిగాయి. వైస్ ఛాన్స్లర్ స్వయంగా రోస్టర్ మార్చి ఇష్టానుసారంగా నియామకాలు చేయడాన్ని హైకోర్టు గుర్తించింది.
మే 2012లోనే ప్రొ.టి.భాస్కర్ రావు, ప్రొ.ఎం.ఎస్.ప్రసాద రావులతో కూడిన ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. 2013, మార్చి 13న ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో హైకోర్టు ఈ నియామకాలపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైస్ ఛాన్సలర్ అక్బర్ అలీఖాన్ ఫిబ్రవరి 25, 2013నే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. జనవరి 4, 2014న మళ్లీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి అదే రోజు సాయంత్రమే విధులు అప్పగించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను వీసీ, నాటి పాలకవర్గం కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడింది. ఈ అక్రమ నియామకాలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి రాములు కమిషన్ సైతం సుదీర్ఘ నివేదికను సమర్పించింది.
సుప్రీంకోర్టుకు బాధిత వర్గం?
హైకోర్టు తీర్పుతో కంగుతిన్న 45 మంది ఆచార్యులు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేసుకుంటున్నట్లుగా తెలిసింది. తమకు ప్రతికూలంగా వచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని యోచిస్తున్టన్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో సీనియర్ ఆచార్యుల పరిస్థితి అయోమయంగా మారింది. 2012 నోటిఫికేషన్‌కు ముందే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వారంతా ఉద్యోగ ఉన్నతిని ఆశించి ఈ రిక్రూట్మెంట్లో ఉద్యోగం తిరిగి పొందారు. దీంతో పాత ఉద్యోగాన్ని వదులుకోవడంతో పాటుగా ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుతో ఈ ఉద్యోగాలకు ఎసరు వచ్చినట్లు అయ్యింది. వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అయోమయంగా మారింది. 2012లో మూడు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 91 ఉద్యోగాలకు గాను 53 మంది ఉద్యోగం పొందారు. ప్రస్తుతం 4 ప్రొఫెసర్లుగా, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 33 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
బజారున పడిన టీయూ పరువు…
తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు నుంచి నేటి వరకు పూటకో దుమారం తెర మీదికి వస్తోంది. పుష్కర కాలంగా నిత్యం వార్తల్లో నిలిచిన 2012 నియామకాల అంశానికి హైకోర్టు తుది రూపం ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు బాధిత వర్గం ఆశ్రయిస్తే తర్వాత ఏమవుతుందనేది ఎవరికి తెలియదు. అయితే నిత్యం ఏదో ఒక అంశంతో టీయూ పరువు బజారున పడటం నిత్యకృత్యమైంది. అవినీతి, అక్రమాల వ్యవహారాలతో తెలంగాణ యూనివర్సిటీ మసక బారింది. మూడేళ్ల క్రితం వరకూ పని చేసిన వీసీ రవీందర్ గుప్తా కాలంలో అనేక ఆరోపణలు వెలుగు చూశాయి. పాలకవర్గం అనుమతి లేకుండానే ఇష్టారీతిన ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి. చివరాఖరకు లం చం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి టీయూను బజారుకీడ్చారు. రవీందర్ గుప్తా సస్పెన్షన్ అనంతరం పలువురు ఐఏఎస్‌లు ఇన్ఛార్జీ వీసీలుగా పని చేశారు. రిజిస్ట్రార్‌గా యాదగిరి, శాశ్వత వీసీగా టి.యాదగిరి రావులు పని చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కానరావడం లేదు. పరిపాలన తీరుతెన్నుల్లో అదే గందరగోళం చోటు చేసుకుంటుండగా పరిష్కరించే నాథుడు కరువయ్యారు.
టీయూలో ఇప్పటికైనా మార్పు రావాలి..
తెలంగాణ యూనివర్సిటీ పెద్దలకు హైకోర్టు తీర్పు ఒక చెంప పెట్టు లాంటిది. ఇప్పటికైనా టీయూలో పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. 2012 నోటిఫికేషన్లో అనర్హులకు పెద్ద పీట వేయడం ద్వారా నేను హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును దక్కించుకోలేక పోయాను. రోస్టర్ పాయింట్లు మార్చడం ద్వారా ఎస్టీ కోటాలో నాకు దక్కాల్సిన ఉద్యోగం వేరే సామాజిక వర్గానికి వెళ్లింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరుకుంటున్నాను.
– వెంకట్ నాయక్, టీయూ 2012 నియామకాలపై పోరాడిన వ్యక్తి