Accident | ఉత్తరప్రదేశ్లో 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ రోడ్డు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) డాక్టర్ తీరథ్ లాల్ ధ్రువీకరించారు. ఈ వ్యాన్ రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్లోని బుదౌన్కు వెళ్తున్న క్రమంలో బాగ్పత్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి 12:30 తరువాత ఈ ఘటన జరిగింది.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని ఎస్పీ సూరజ్ రాయ్ తెలిపారు. ఖేక్ర పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బందితో పాటు డయల్ 112కు చెందిన నాలుగు పోలీస్ రెస్పాన్స్ వాహనాలు, అంబులెన్సులతో క్షతగాత్రులందరినీ ఆస్పతిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
గాఢనిద్రలో ఉండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చి వ్యాన్ బోల్తాపడింది. వెంటనే ఆర్తనాదాలు వినిపించాయని క్షతగాత్రుడు కున్వర్ పాల్ తెలిపారు. వ్యాన్ను వెనుకవైపు నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ వెల్లడించారని ఎస్పీ రాయ్ తెలిపారు. ప్రమాదానికి అసలు కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.