ధనుర్మాస వేళ వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలు వినిపిస్తే.. శివాలయాల్లో తిరువెంబావై గీతాలు ప్రతిధ్వనిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవారు మాణిక్య వాచకర్. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవారు. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవారు. ఆ అమృతగానం వింటూ మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపేవారు. అలా మొదలైన తిరువెంబావై ప్రభ.. నేటికీ కొనసాగుతూనే ఉంది. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను చదువుతుంటారు.
ఈ పాశురాల సంఖ్య ఇరవై. ప్రతి పాశురం ‘ఏలోరెంబావై’ అనే మకుటంతో ముగుస్తుంది. ‘ఏలోరెంబావై’ అంటే ‘నిద్ర నుంచి మేల్కొని పరమాత్మను ధ్యానించు’ అనే అర్థాన్ని ఇస్తుంది. శివతత్వాన్ని వివరించే ఈ పాశురాలు ‘పంచభూతాత్మకుడైన శివుడు అందరిలోనూ ఉన్నాడని వర్ణిస్తాయి. భగవంతుడి ముందు అందరూ సమానులే’ అన్న భావనను చాటిచెబుతాయి.