న్యూఢిల్లీ: 12-14 ఏండ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ను వేయనున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు వేయనున్నామని తెలిపింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 2010 లేదా అంతకన్నా ముందు జన్మించినవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. 12 ఏండ్లు నిండినవాళ్లు మాత్రమే పేరును నమోదు చేసుకోవాలని, ఒకవేళ 12 ఏండ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇవ్వమని స్పష్టం చేసింది. కొవిన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని ఇప్పటికే టీకా తీసుకున్న తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ (స్లాట్) ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. అలాగే టీకా కేంద్రానికి వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చని సూచించింది. 60 ఏండ్లు పైబడినవాళ్లకు కూడా ముందస్తు డోసును (బూస్టర్ డోస్‌ను) ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో ఏ టీకా అయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకాను ఇవ్వనున్నట్టు వివరించింది.
పొరపాట్లు జరుగకుండా చూసుకోండి
పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ మిక్సింగ్లాంటివి (తొలి, రెండో డోసు టీకాలు వేర్వేరివి కాకుండా చూసుకోవడం) జరుగకుండా చూసుకోవాలని కోరింది. టీకా ఇవ్వడంలో శిక్షణ పొందిన వారినే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో నియమించాలని తెలిపింది. టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటుచేయాలని సూచించింది. టీకాల వృథాను అరికట్టాలని కోరింది.