హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలో( Universities ) ఖాళీలను భర్తీ చేయకుండా కేవలం అభివృద్ధి ప్రణాళిక అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి (Patlolla Shashidhar Reddy ) అన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ( CM Revanth reddy ) బహిరంగ లేఖ రాశారు.
ప్రధానంగా విద్యా, వైద్యం అనేది అన్ని పార్టీల మేనిఫెస్టోలో ముఖ్యమైన ప్రణాళిక ఉంటాయి కానీ ఆచరణలో అది అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో దాని యొక్క స్వరూపం బయటపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం యూనివర్సిటీలలో దాదాపుగా 72శాతం ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా ప్రగతి అనేది సాధ్యం కానే కాదని వెల్లడించారు.
జాతీయస్థాయిలోని ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకత ఉందని, కావలసిన సిబ్బంది లేక వాటి ర్యాంకింగ్‌లు పడిపోతున్నాయని అన్నారు. విద్యకు బడ్జెట్లో 18 శాతం నిధులు కేటాయించిన గాని ఖర్చు చేయడం లేదని వివరించారు. వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయంలో ఖాళీలను భర్తీ చేసి దాని ద్వారా ప్రణాళిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎంకు సూచించారు.