TDP MLA : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై జగన్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలోని రుషికొండపై జగన్ విలాసాల కోసం నిర్మించిన ప్యాలెస్ ఖర్చుతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని పోలుస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రుల కోసం కడుతున్న రాజధానికి చదరపు అడుగుకి రూ.12,000 ఖర్చు అవుతున్నదని జగన్ అబద్ధాలు చెబుతున్నారని కన్నా విమర్శించారు. అలాంటప్పుడు తన విలాసాల కోసం కట్టిన రుషికొండ ప్యాలెస్‌కు అంత భారీ ఖర్చు ఎందుకు చేశారని ప్రశ్నించారు. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, రాజధాని విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
అమరావతి నిర్మాణానికి చదరపు అడుగుకు అయ్యే ఖర్చు కేవలం రూ.6,985 మాత్రమేనని కన్నా పేర్కొన్నారు. కానీ జగన్ తన విలాసాల కోసం కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు.