శాన్ జోస్ : తమ దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్లో కొందరిని అమెరికా కోస్టారికా దేశానికి తరలించనుంది. అలా తరలిస్తున్న వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. అమెరికా పంపించి వేస్తున్న వలసదారులకు ఆశ్రయం కల్పించి వారిని వారి దేశాలకు పంపడంలో వారధిగా పనిచేయనున్నట్టు కోస్టారికా ప్రకటించింది. దీంతో భారత్, మధ్య ఆసియాకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా అక్కడికి తరలించనుంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
దీనిలో భాగంగా తొలి విడతగా, 200 మంది అక్రమ వలసదారులు ప్రత్యేక విమానంలో బుధవారం జువాన్ శాంటమేరియా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చేవ్స్ రోబ్లెస్ కార్యాలయం ప్రకటించింది. వీరంతా మధ్య ఆసియా, భారత్కు చెందిన వారని వెల్లడించింది. వీరిని ఆయా దేశాలకు తరలించే ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలిస్తామన్నారు. ఇందుకు అమెరికాయే నిధులను సమకూరుస్తుంది. కాగా, అమెరికా ఇప్పటికే 332 మంది మంది భారతీయ అక్రమ వలసదారులను భారత్కు పంపిన విషయం తెలిసిందే.