Illegal Immigrants | వాషింగ్టన్, ఏప్రిల్ 13: అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అమెరికా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తున్నది. గడువుకు మించి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తక్షణమే దేశాన్ని వీడాలని ఆ దేశ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టంచేసింది. దేశంలో 30 రోజులకు మించి నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదుచేసుకోవాలని ఆదేశించింది. లేదంటే జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి అని సూచించింది.
భారీ జరిమానాలు తప్పవు
స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి దేశంలో నివసిస్తున్న వారికి రోజుకు 998 డాలర్లు (సుమారు 85,924రూపాయలు) జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా స్వీయ బహిష్కరణలో విఫలమైతే వారికి రోజుకు వెయ్యి నుంచి ఐదు వేల యూఎస్ డాలర్లు (రూ.86 వేల నుంచి 4.30 లక్షల వరకు) జరిమానా వేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. అలా చేయడం వల్ల వారు వెళ్లే విమానాలను ఎంపిక చేసుకోవచ్చునని, వారిపై ఎలాంటి కేసులు లేకపోతే అమెరికాలో వారు సంపాదించిన సొమ్మును తమ వద్దే ఉంచుకోవచ్చునని తెలిపారు. ఒక వేళ తమ దేశాలకు వెళ్లే చార్జీలను భరించలేకపోతే వారు సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని పేర్కొన్నారు.
నమోదు తప్పనిసరి
30 రోజులకు పైగా అమెరికాలో నివసిస్తున్న 14 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తప్పనిసరిగా ఫాం జీ-325ఆర్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ 11 లేదా ఆ తర్వాత వచ్చిన వారు 30 రోజుల్లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. లేకపోతే వారికి జరిమానా, జైలు లేదా రెండు శిక్షలు విధించవచ్చు. అలాగే చిరునామా మారితే దానిని 10 రోజుల్లో తెలియజేయకపోతే 5000 డాలర్ల జరిమానా విధిస్తారు. 14 ఏండ్లు నిండిన వారు కూడా రీ రిజిస్ట్రేషన్‌ను 30 రోజుల్లో చేసుకోవాలి.
24 గంటలూ ఐడీలు మీ దగ్గరుండాల్సిందే
అమెరికాలో నివసించే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇక నుంచి వారు చట్టపరమైన స్థితిని రుజువు చేసే ఐడీ కార్డును నిత్యం తమ వద్దే ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులకు ఇది చాలా ఇబ్బందికరమేనని చెప్పవచ్చు. ప్రస్తుతం యూఎస్‌లో 54 లక్షల మంది భారతీయులు ఉండగా, అందులో 2,20,000 మంది (అమెరికా మొత్తం వలసదారుల్లో 2 శాతం) అక్రమ వలసదారులే. హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్న భారతీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోనక్కర్లేదు. అయితే ఐడీ కార్డులను మాత్రం తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలి.
అమెరికా సందర్శన హక్కు కాదు
అమెరికాను సందర్శించడం హక్కు ఎంత మాత్రం కాదని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. ఇటీవల వలసవాదులు, కొందరు విదేశీ విద్యార్ధుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలపై విమర్శలు వస్తున్న క్రమ ంలో రుబియో తమ దేశ వైఖరిని సమర్థించుకున్నారు. అమెరికా వీసా అనేది తమ దేశ చట్టాలు, విలువల ను గౌరవించే వారికి మాత్రమే ప్రత్యేకించిన హక్కు అని, దరఖాస్తుదారులందరికీ మంజూరుచేసే హక్కు ఎంతమాత్రం కాదని తెలిపారు. ఇటీవల క్యాంపస్‌లలో నెలకొన్న అశాంతి, అంతర్జాతీయ ఉగ్రవాద ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వీసా అర్హత, జాతీయ భద్రత విషయంలో ట్రంప్ యంత్రాంగం రాజీలేని విధానాలను అవలంబిస్తున్నదని అన్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కొంతమంది విదేశీ విద్యార్థులను బహిష్కరించారు. కొన్ని రకాల వీసాలను రద్దు చేశారు. ఫెడరల్ నిధులను పొందుతూ పాలస్తీనా అనుకూల విధానాలకు మద్దతు తెలియజేస్తున్న యూనివర్సిటీలకు హెచ్చరికలు జారీ చేశారని రుబియో చెప్పారు. ఇవన్నీ తమ జాతీయు భద్రత కోసం తీసుకున్న చర్యలేనని అన్నారు. ఎవరైనా తమకు హాని చేయాలని భావిస్తే కఠిన చర్యలకు వెనుకాడం అని హెచ్చరించారు.