సిటీబ్యూరో, జనవరి 15 (నమస్తే తెలంగాణ): బిహార్ నుంచి తుపాకులు తెచ్చి నగర శివారులో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఉత్తర్ప్రదేశ్వాసిని భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి .32 ఎంఎం రెండు పిస్టోల్స్, ఒక తపంచా, 10 లైవ్ రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్, బల్లియ జిల్లాకు చెందిన హరెకృష్ణ యాదవ్ ఇంటర్ వరకు చదివి, 2019లో తన సోదరుడు మురళితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు.
బీబీనగర్‌లో ఒక కంపెనీలో 2022 వరకు పనిచేసి.. తిరిగి తన స్వస్థలం వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే.. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తన గ్రామ పరిధికి పక్కనే ఉన్న బిహార్ రాష్ట్రంలో అక్రమంగా తుపాకులు తయారు చేసేవారి వద్ద తక్కువ ధరకు కొని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ఫ్లాన్ చేశాడు. ఇందులో భాగంగా హరేకృష్ణ వివిధ రకాలైన మూడు ఆయుధాలు బిహార్, భోజపూర్ జిల్లా, బిహియ మండలానికి చెందిన సంపత్ యాదవ్ వద్ద కొనుగోలు చేశాడు. వాటిని హైదరాబాద్ తెచ్చి విక్రయించేందుకు యత్నిస్తుండగా అంబేద్కర్‌నగర్ బస్‌స్టాప్ వద్ద భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు అమ్మిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.