లక్నో, ఫిబ్రవరి 8: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను యూపీలోని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం సాగుకు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ వంటి తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయి. ఈ మేరకు బీజేపీ, ఎస్పీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలను రూపొందించాయి. యూపీలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే సాగుకు ఉచిత విద్యుత్తు అందిస్తామని అధికార బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇంటింటికీ ఉద్యోగం, 60 ఏండ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది.
లవ్‌జీహాద్‌కు పాల్పడేవారికి 10 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. రెండు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న సన్నకారు రైతులకు ఉచిత విద్యుత్తు, ఇండ్లల్లో 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మ్యానిఫెస్టోలో వెల్లడించింది. ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని పంజాబ్ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వెల్లడించగా.. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్‌పై మూడేండ్లపాటు సుంకాలు విధించబోమని గోవా బీజేపీ విభాగం హామీ ఇచ్చింది.
యూపీ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై
ఉత్తరప్రదేశ్ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్రకటించారు. బైరియా నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్రసింగ్కు బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించింది. ఇక్కడ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లాను బరిలోకి దింపింది.