
200 వాయుసేన కుటుంబాల మినీ మారథాన్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్లో ఆదివారం ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ మార్షల్ కేఎస్కే సురేశ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వాయుసేనకు చెందిన 200 మంది సిబ్బంది, వారి కుటుంబసభ్యులు 7.5 కిలోమీటర్ల మినీ మారథాన్‌లో పాల్గొన్నారు. ఐక్యత స్ఫూర్తిని చాటిచెప్పే ప్లకార్డులను ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ఉక్కు మనిషి’ వల్లభ్‌భాయ్ పటేల్‌ను స్మరించుకొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కేఎస్కే సురేశ్ చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిబ్బందికి, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు.