న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలను దశల వారీగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టైమ్స్ డ్రైవ్ ఆటో సమ్మిట్, అవార్డులు 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. భౌతిక టోల్ బూత్‌ల అవసరాన్ని పూర్తిగా తొలగించే వ్యవస్థ వైపు ప్రభుత్వం పయనిస్తున్నదని అన్నారు. దీని ప్రకారం హైవేలపై టోల్ ప్లాజా బూత్‌లు ఉండవని, ఆటోమెటిక్‌గా టోల్ చార్జీని వసూలు చేస్తామని చెప్పారు.
నంబర్ ప్లేట్ల గుర్తింపు, ఫాస్టాగ్ లింక్డ్ వ్యవస్థల ద్వారా వాహనాలు ప్రయాణించిన కచ్చితమైన దూరం ఆధారంగానే టోల్చార్జీని వసూలు చేస్తామని తెలిపారు. ‘ఉదాహరణకు మీరు 80 కి.మీ ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు. మేం మీ నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ వివరాలను క్యాప్చర్ చేసి మీరు అప్పటివరకు ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ చార్జీని మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తగ్గించుకుంటాం’ అని వివరించారు.