సిరిసిల్ల టౌన్, జూన్ 13: ‘మా కార్యకర్తలంటే మీ ఎస్పీకి అంత కోపమెందుకు? మా వాళ్లతోనే బసీలు తీపిస్తాడా? వాళ్లను కార్యకర్తలు అనుకుంటున్నాడా? అసలు మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు?’ అంటూ డీఎస్పీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రుసరుసలాడారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి-మన బాధ్యత’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడ ఎస్పీ మహేశ్ కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అసలు మీ ఎస్పీ.. ఏం అనుకుంటున్నాడు?’ అని డీఎస్పీ నాగేంద్రాచారితో అసహనం వ్యక్తంచేశారు. ‘మన బడి-మన బాధ్య త’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తరగతి గదిని శుభ్రం చేస్తున్న సమయంలో డెస్క్ టేబుల్ బండి సంజయ్‌పై పడబోయింది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.