Bandi Sanjay | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): చట్టంపై గౌరవంతో బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్టు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడైనా సమానమేనని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయలేదని ‘మా అబ్బాయి పదేపదే చెప్తున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతడిని స్టేషన్లో అప్పగిద్దామని అనుకున్నా.. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను భగీరథ్ పోలీసుల ముందుంచాడు.
ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే అప్పగింతలో జాప్యం జరిగింది. ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో మా అబ్బాయిని లాయర్ల ద్వారా పోలీసులకు విచారణ కోసం అప్పగించాను. న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను..’ అని బండి సంజయ్ తెలిపారు.