Union Budget | న్యూఢిల్లీ/(స్పెషల్ టాస్క్ బ్యూరో), ఫిబ్రవరి 1: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబును మురిపించడానికి ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమించారు. మిత్రపక్షాలను కాపాడుకోవాలనే తాపత్రయం బడ్జెట్లో అడుగడుగునా ప్రతిబింబించింది. బీహార్, ఏపీకి బడ్జెట్లో అగ్రతాంబూలం ఇవ్వడమే ఇందుకు రుజువు.
అయితే, బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు బడ్జెట్లో పెద్దపీట వేసిన కేంద్రం.. విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాలకు మాత్రం ఎప్పటిలాగే మొండిచేయి చూపించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోటి వెంట వినపడకపోవడం గమనార్హం. కాగా, ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ర్టానికి కేంద్రం అదనంగా మరిన్ని వరాలు ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా ఈ బడ్జెట్‌ను బీహార్ బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో బీహార్‌కు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. బీహార్‌కు చెందిన మధుబనీ చీర ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ రాష్ర్టానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో మఖానా(తామర గింజల) బోర్డును ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. విమానయాన రంగంలోనూ ఆ రాష్ర్టానికి పెద్దపీట వేశారు.
ఒక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించడంతో పాటు పట్నా విమానాశ్రయం సామర్థ్యాన్ని విస్తరిస్తామని, బీహార్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పశ్చిమ కోశీ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని నెలకొల్పుతామని, ఐఐటీ పాట్నాలో మౌలిక సదుపాయాలు, హాస్టల్ విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. అటు ఏపీకి కూడా కేంద్రం బడ్జెట్ ఫలాలను పెద్దయెత్తనే అందించింది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టుకు భారీగా నిధులు కేటాయించింది. ఏపీలో రోడ్లు, వంతెనల నిర్మాణం చేపడుతామని, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి సాయం అందిస్తామని కేంద్రం హామీనిచ్చింది.
కేంద్ర బడ్జెట్లో బీహార్‌కు అధిక ప్రాధాన్యత దక్కడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది బడ్జెట్లో కూడా కేంద్రం రూ.58,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను బీహార్‌కు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడటంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
తన మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి బీహార్‌కు భారీగా నిధులు రప్పించడంలో నితీశ్ కుమార్ సఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా బీహార్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎన్డీఏకు కీలకం కావడం వల్ల కూడా బడ్జెట్లో ఈ రాష్ర్టానికి ప్రాధాన్యత దక్కినట్టు కనిపిస్తున్నది.
మొత్తం బడ్జెట్ రూ. 50,65,345 కోట్లు