న్యూఢిల్లీ, మే 13: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధిచెంది రూ. 1,440 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 1,330 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ. 19,805 కోట్ల నుంచి రూ. 20,417 కోట్లకు చేరినట్టు స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన సమాచారంలో యూనియన్ బ్యాంక్ వెల్లడించింది.
2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభం రూ. 2,906 కోట్ల నుంచి రూ. 5,232 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 80,512 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 80,469 కోట్ల వద్ద నిలిచింది. స్థూల నిరర్థక ఆస్తులు 13.74 శాతం నుంచి 11.11 శాతానికి, నికర ఎన్పీఏలు 4.62 శాతం నుంచి 3.68 శాతానికి తగ్గాయి. శుక్రవారం సమావేశమైన బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్…షేరుకు రూ. 1.90 చొప్పున (19 శాతం) డివిడెండ్‌ను సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 8 శాతం పెరిగి రూ. 36.35 వద్ద ముగిసింది.