ZHMC | ఏదైనా ఒక నగర జనాభా అసమతుల్యంగా పెరిగినప్పుడు, జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేనప్పుడు, అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు డీలిమిటేషన్ ద్వారా వార్డులను విభజిస్తారు. తద్వారా అన్ని వార్డుల్లో దాదాపు సమాన జనాభా ఉండేలా చేసి పరిపాలనాపరంగా ఇబ్బందులు రాకుండా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే కారణం చెప్పింది. కానీ, వాస్తవంలో మాత్రం ఈ డీలిమిటేషన్లో కాంగ్రెస్ సర్కార్‌కు ఆ ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ చూస్తే ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.
జీహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. దీంతో జీహెచ్ఎంసీ వైశాల్యం దాదాపు 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,000 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. డివిజన్ల సంఖ్య 150 నుంచి 300కు పెరిగాయి. తద్వారా హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. అయితే, ఈ డివిజన్లను 300లకు పెంచడానికి ప్రాతిపదిక ఏమిటనేది, ఏదైనా కమిటీ అధ్యయనం చేసి ఇన్ని పెంచాలని సూచించిందా అన్నదానిపై స్పష్టత లేదు.
జీహెచ్ఎంసీ విస్తరణ, డీలిమిటేషన్‌కు సంబంధించి చట్టపరంగా అనేక లోపాలు, అస్పష్టతలు ఉన్నాయి. సరైన సంప్రదింపులు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ చేపట్టారు. ఆయా ప్రాంతాల ప్రజలు, రాజకీయ పార్టీలు, స్థానిక ప్రతినిధులతో చర్చించలేదు. 7 రోజులు మాత్రమే అభ్యంతరాలు స్వీకరించారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ జనరల్ బాడీ ముందు ప్రవేశపెట్టలేదు. ఇది చట్ట విరుద్ధం. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ (వార్డుల డీలిమిటేషన్) రూల్స్ ప్రకారం ఇది తప్పనిసరి. అంతేకాకుండా, విలీనం చేస్తున్న స్థానిక సంస్థల గ్రామ పంచాయతీలు లేదా మున్సిపాలిటీలతో సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడం గతంలోనూ సమస్యలకు దారితీసింది. స్థానిక పంచాయతీలను సంప్రదించ లేదన్న కారణంతో 2014లో 36 గ్రామాల విలీనాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఇప్పుడు కూడా దీనిపై హైకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో శాస్త్రీయత లేదు. జనాభా నిష్పత్తి, భౌగోళిక సమతుల్యత, సహజ సరిహద్దులను (నాలాలు, రోడ్లు) పట్టించుకోకుండా డివిజన్ల సరిహద్దులు మార్చారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీహెచ్ఎంసీ మ్యాపులోనూ స్పష్టమైన సరిహద్దులు లేవు. జీహెచ్ఎంసీ జనాభాను 1.2 కోట్లుగా అంచనా వేసి, ఆ జనాభా ప్రాతిపదికన డివిజన్లను 300కు పెంచారు. అంటే ఒక్కో డివిజన్‌కు సగటున 40 వేల మంది జనాభా ఉండాలి. జనాభా విస్తరణ అంతటా సమానంగా ఉండదు కాబట్టి, 10 వేలు అటూఇటూ ఉండొచ్చు. కానీ, ప్రభుత్వం ప్రకటించిన గెజిట్లోనే కొన్ని డివిజన్లలో జనాభా 70 వేలకు పైగా, కొన్నిచోట్ల 30 వేల మంది మాత్రమే ఉన్నారు. ఇది ఏ రకంగానూ సరికాదు.
అందుకే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ విధానంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్‌ను కలిసి తమ అభ్యంతరాలను సమర్పించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ‘అశాస్త్రీయం’గా ఉందని, సంప్రదింపులు లేకుండా జరిగిందని దానం నాగేందర్, అరికెపూడి గాంధీ తదితరులు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే డివిజన్ల పునర్విభజనకు పూనుకున్నారని, కొత్తగా విలీనమైన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్, రోడ్‌మ్యాప్ లేవని ప్రశ్నించారు. కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య అసమానంగా ఉందని, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయకుండా సరిహద్దులను స్పష్టత లేకుండా నిర్ణయించారని పేర్కొన్నారు.
ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలోనే డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి కనీస సదుపాయాలను ప్రభుత్వం సరిగ్గా కల్పించలేకపోతున్నది. అటువంటిది జీహెచ్ఎంసీ పరిధిని మరింత పెంచితే, కొత్తగా చేరే ప్రాంతాలకు నిధులు కేటాయించడం భారమవుతుందని, దీనివల్ల పాత నగరం, కొత్త ప్రాంతాలు రెండూ నిర్లక్ష్యానికి గురవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రజలు జోనల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు చెప్తున్నారు. అంతేకాకుండా అధికార వ్యవస్థ ఒకే దగ్గర కేంద్రీకృతమై పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీలోనే డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ సరిగా లేవని విమర్శలు వస్తున్న వేళ విస్తరణతో సమస్యలు మరింత పెరుగుతాయనే వాదన కూడా ఉంది. వాస్తవానికి గతంలో తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేసినప్పుడు, 2009లో దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడిన నిపుణుల కమిటీ వేసి సుదీర్ఘ చర్చలు జరిపి, శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో కోటిన్నర జనాభా, దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు తొందరపాటుతో చేసే ఏ ఒక్క చర్య అయినా ప్రతికూలం గా మారవచ్చు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అన్ని రాజకీయ పార్టీలు, నిపుణులతో కూడిన ఒక హైపవర్ కమిటీ వేసి, అన్ని వర్గాలతో సంప్రదించి డీలిమిటేషన్ చేస్తే మంచిది.
కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు పూనుకోవడం వెనుక కేవలం రాజకీయ ఉద్దేశాలు, రియల్ ఎస్టేట్ లాబీలకు ప్రయోజనం చేకూర్చాలన్న కుట్ర ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీలో విలీనమవుతున్న ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడం తప్ప, దీని వల్ల సామాన్యులకు ఏదైనా లాభం ఉంటుందా? పైగా పన్నులు పెరుగుతాయి. స్థానికంగా ఉండేవారు ఇల్లు కట్టుకోవాలన్నా.. ఏదైనా అనుమతులు తీసుకోవాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్య స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి విరుద్ధం. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు విస్తృత సంప్రదింపులు, స్పష్టమైన చట్టబద్ధ ప్రక్రియలను అనుసరించాలి. రేవంత్ సర్కారు ఇకనైనా ప్రజాభిప్రాయ ప్రాముఖ్యాన్ని గుర్తించాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-షేక్ ఫారెజ్ ,96661 74738