న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్ పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందచేసే స్కూళ్ల సంఖ్య 2020-21లో 11.1 లక్షలు ఉండగా 2024-25 నాటికి ఈ సంఖ్య 10.3 లక్షలకు పడిపోయిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది. ఐదేండ్లలో 84,453 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినట్లు ఈ సంఖ్య తెలియచేస్తోంది. 2020-21 , 2021-22 మధ్య అత్యధికంగా 35,574 స్కూళ్లలో ఈ పథకం నిలిచిపోయినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఉత్తర్ ప్రదేశ్‌లో అధికంగా స్కూళ్ల సంఖ్య తగ్గింది. 2020-21 లో 1.6 లక్షల స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందచేస్తుండగా 2024-25కి ఈ సంఖ్య 1.4 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి అయ్యే వస్తువుల ఖర్చు పెంచినట్లు ఆయన చెప్పారు. ఈ పథకం కింద కిండర్‌గార్టెన్ విద్యార్థిపై(1 నుంచి 5 వరకు) రోజుకు వస్తువుల ఖర్చును రూ. 6.1 నుంచి రూ. 6.7కి ప్రభుత్వం పెంచింది. 6 నుంచి 8వ తరగతి వరకు ఖర్చును రూ. 9.2 నుంచి రూ. 10.1కి పెంచింది.