హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నవేళ మహిళలు కూడా పురుషులతో సమానంగా తమ సత్తా చాటుతున్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినప్పటికీ వారు పనిచేసే చోట వివక్షను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. ఐటీ సంబంధిత ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఐటీయేతర కంపెనీల్లో పనిచేస్తున్న వారి కంటే ఎక్కువగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. లింగ వివక్షత, యాజమాన్యాల పక్షపాతం కారణంగా చాలామంది మధ్యలోనే కెరీర్ను ముగించేస్తున్నారు. కెరీర్ యాక్సిలరేషన్ ఫ్లాట్ఫామ్, ది స్టార్ ఇన్ మీ సర్వే ప్రకారం పెద్ద సంఖ్యలో మహిళా నిపుణులు తమ కార్యాలయాల్లో లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని తేలింది. దేశంలోని 700 ప్రముఖ కంపెనీల్లోని మహిళా నిపుణులతో ఆ సర్వే కొనసాగింది. వృత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, కెరీర్ ఉన్నతి తదితర అంశాలపై వివరాలను సేకరించారు. మొత్తంగా 72 శాతం టెక్ సంస్థలు లింగ వివక్ష చూపుతుండగా, నాన్ టెక్ సంస్థల్లో ఇది 46శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఏ రంగంలోని మహిళలకైనా వ్యక్తిగతంగా వివాహం, ప్రసవం, కుటుంబ బాధ్యతలు సర్వసాధారణమే. ఈ అంశాలనే సాకుగా చూపుతూ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు మహిళల నియామకాన్ని క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని ఆ సర్వే నివేదిక తెలిపింది. ఆయా ఐటీ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే లింగ వివక్ష చూపుతున్నాయని పేర్కొంది. విభిన్నమైన శ్రామికశక్తి వృద్ధి చెందడానికి వీలు కల్పించే సమ్మిళిత సంస్కృతులను సృష్టించేందుకు, మొదట లింగ వివక్షను రూపుమాపాలని, వాటిపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని, నాయకత్వంలో లింగ అంతరాన్ని తగ్గించాలని, మహిళల ప్రతిభను పెంచడానికి ప్రయత్నించాలని ఆ నివేదిక సూచించింది.
ఒత్తిడి 22శాతం
మెటర్నల్ 15శాతం
పదే పదే సామర్థ్యాలను
నిరూపించుకోవడం 21శాతం
పోటాపోటీ 13శాతం
ఇతర సమస్యలు 28శాతం