Zelenskyy | ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్స్కీ(Ukrainian President Zelenskyy) కి పెను ప్రమాదం తప్పింది. డ్రోన్ దాడి (drone attack)నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నార్వే(Norwegian)ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వివరాలను వెల్లడించారు. నార్వే రాజు హెరాల్డ్ అంత్యక్రియల కోసం జెలెన్స్కీ విమానంలో మోల్డోవా నుంచి ఓస్లోకు బయలుదేరారు. జెలెన్స్కీ మోల్డోవా నుంచి ఓస్లోకు బయలుదేరుతున్నప్పుడు జెలెన్స్కీ విమానాన్ని ఒక డ్రోన్ దాదాపు ఢీకొట్టేంత పని జరిగిందన్నారు.
”మోల్డోవా నుండి బయలుదేరుతున్నప్పుడు జెల్‌న్‌స్కీ విమానాన్ని ఒక డ్రోన్ దాదాపు ఢీకొట్టింది. ఆయన జీవిస్తున్న రియాలిటీ ఇదే” అని స్టోర్ నార్వే ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్ఆర్కేకు తెలిపారు. యుద్ధం మధ్యలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను ఈ ఘటన ఎత్తిచూపిందని స్టోర్ తెలిపారు. ఈ చర్య తీవ్ర ఆందోళను కలిగిస్తుందని స్టోర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు వెల్లడించేందుకు స్టోర్ నిరాకరించారు.
కాగా, జెలెన్స్కీ మంగళవారం సాయంత్రం ఓస్లో చేరుకున్నారు. అక్కడ జెలెన్స్కీ… నార్వే ప్రధాని స్టోర్, ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, విదేశాంగ మంత్రి ఎస్పెన్ బార్త్ ఐడెలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు నార్వే సైనిక సహాయం, వాయు రక్షణ మద్దతుతో సహా, పౌర సహాయంపై కీలకమైన చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థ అవసరం వంటి అంశాలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్టోర్ తెలిపారు. అలాగే నార్వే రాజు హెరాల్డ్ అంత్యక్రియల అనంతరం జెలెన్స్కీ, నార్వే నుంచి బయలుదేరి కెనడాకు వెళ్లి అక్కడి నాయకులతో చర్చలు జరపనున్నారని స్టోర్ ఎన్ఆర్కేతో చెప్పారు.