న్యూఢిల్లీ: ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్తులను భారత్ పట్టుకున్నది. యూఏఈ అధికారుల సహకారంతో వాళ్లను అరెస్టు చేశారు. దొంగ పాస్‌పోర్టు రాకెట్ నడిపిన కేసులో అలోక్ కుమార్.. ఎస్బీఐ బ్యాంకులో 2672 కోట్ల మోసానికి పాల్పడిన కమలేశ్ పరేక్ను భారత్ అరెస్టు చేసింది. యూఏఈ నుంచి ఆ ఇద్దర్నీ భారత్‌కు తీసుకువచ్చారు. వేర్వేరు ఆపరేషన్స్ నిర్వహించి ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. సీబీఐతో పాటు విదేశాంగ శాఖ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నది. నకిలీ పాస్‌పోర్టు రాకెట్ నడిపిన అలోక్ కుమార్ అలియాస్ యశ్పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లల్లో బ్యాంకు మోసాలకు పాల్పడ్డ కమలేశ్ పరేక్ను కూడా యూఏఈలోనే అరెస్టు చేశారు. ఆర్థిక నేరగాళ్ల విషయంలో భారత్ సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే.
అలోక్ కుమార్ అలియస్ యశ్పాల్ సింగ్.. హర్యానా పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతనిపై చీటింగ్, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కేసులు ఉన్నాయి. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేరగాళ్లకు ఫేక్ ఐడీ, విదేశీ అడ్రస్‌లతో పాస్‌పోర్టులు ఇప్పించాడతను. ఆ రాకెట్లో అలోక్ ప్రధాన నిందితుడు. కొందరికి ఇమ్మిగ్రేషన్ ఇప్పించినట్లు కూడా అతనిపై అభియోగాలు ఉన్నాయి. రెండో నేరస్థుడు కమలేశ్ పరేక్ ఎస్బీఐ గ్రూపు బ్యాంకుల నుంచి సుమారు 2672 కోట్ల రుణం తీసుకుని మోసం చేశాడు. తప్పుడు పద్ధతిలో బ్యాంకు రుణాలను విదేశాలకు తరలించాడని, ఆ తర్వాత లావాదేవీలను నిర్వహించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఇద్దరు నేరస్థులు యూఏఈలో ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ నోటీసులు జారీ చేశారు. దీంతో యూఏఈ అధికారులు ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అప్పగింత ప్రక్రియ జరిగింది. ఇంటర్‌పోల్ ద్వారా ఇటీవల సుమారు 150 మంది వాంటెడ్ నేరస్తులను పట్టుకున్నారు.