బులవాయొ : ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సూపర్ సిక్స్ గ్రూప్-డీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్.. 58 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బ్యాట్‌తో మోస్తరు స్కోరు చేసినప్పటికీ బంతితో దాయాదిని మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత అండర్ -19 జట్టు.. 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లు కట్టడిచేసినా వేదాంత్ త్రివేది (98 బంతుల్లో 68, 2 ఫోర్లు, 1 సిక్స్), కన్షిక్ చౌహాన్ (35) భారత్‌ను ఆదుకున్నారు. ఛేదనలో పాకిస్థాన్.. లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదిస్తేనే సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా భారత బౌలర్లు కట్టడిచేయడంతో ఆ జట్టు సెమీస్ ఛాన్స్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్పోయింది. 31 ఓవర్లకు 151/3గా ఉన్న పాక్.. ఆ తర్వాత 40 పరుగులకే కుప్పకూలి (46.2 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌట్) ఓటమిని మూటగట్టుకుంది. ఖిలాన్ పటేల్ (3/35), అయూశ్ మాత్రె (3/21) మెరిశారు. సెమీస్‌లో భారత్.. అఫ్ఘానిస్థాన్‌తో ఆడనుండగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో తలపడుతుంది.