జహీరాబాద్ : జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ( Bike thefts ) దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జహీరాబాద్ ( Zaheerabad ) పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్థానిక ఎస్సై తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఇద్దరు యువకులు పల్సర్ మోటార్ సైకిల్, యాక్టివా వాహనాలపై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా పట్టుకుని విచారించారు. ఈ విచారణతో వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నట్లు అంగీకరించారని, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ( DSP Rammohan Reddy ) పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జహీరాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్ ( 19) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా మరో మైనర్ సాయి చరణ్ (16 ) పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లో 10 తరగతి చదువు చదువుతున్నాడని వివరించారు. ఈ ఇద్దరు గత సంవత్సరం నుంచి మోటార్ సైకిళ్లను దొంగిలిస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను చోరీ చేశారని తెలిపారు.
వీరి వద్ద నుంచి ఒక కమ్మ కత్తి, చాకు 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఇద్దరు దొంగలను పట్టుకున్న జహీరాబాద్ పట్టణ సీఐ ఎస్ శివలింగం, పట్టణ ఎస్సై ఎం కాశీనాధ్ , ఐడీ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, కానిస్టేబుళ్లు అగు సంజీవ్ రావు, ఓందేవ్, అస్లామ్, ఆనంద్‌ను అభినందించారు.