హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో కొత్త ఆర్థికనేరం సోమవారం రాత్రి వెలుగుచూసింది. కోటి రూపాయలకు రెండు కోట్లు ఇస్తామని నమ్మబలికిన హ్యాకర్‌కు ఆ మొత్తం ఇచ్చేందుకు ఇన్నోవా కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు నార్సింగి వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో విజయవాడకు చెందిన ఇద్దరు, సిద్దిపేటకు చెందిన ఒకరు ఉన్నారు. తమ వద్ద ఉన్న నగదుపై వీరు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును మంగళవారం ఐటీ అధికారులకు అప్పగిస్తామని మాదాపూర్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు.