గజ్వేల్, డిసెంబర్ 8: రాత్రి పెట్రోలింగ్ విధులు ముగించుకొని హాఫ్ మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను గుర్తుతెలియని వాహనం ఢీకొనడం తో అక్కడికక్కడే దుర్మరణం చెం దా రు. గజ్వేల్ సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం గాడిచెర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్ (38) దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో, చిన్నకోడూర్ మండలం పెద్దకోడూరుకు చెందిన వర్దోలు పరంధాములు (46) రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ హైదరాబాద్ ఈసీఐఎల్‌లో నిర్వహించే హాఫ్ మారథాన్‌లో పాల్గొనేందుకు బైక్‌పై ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. గజ్వేల్ జాలిగామ బైపాస్‌రోడ్డులో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుళ్ల మృతికి మాజీ మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనూరాధ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హరీశ్ భరోసా ఇచ్చారు.